సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జీవిత విశేషాలు తెలుసుకుందాం…
సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న జన్మించారు. ఆయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. వీరు తెలుగు వారే అయినా మద్రాసులో స్థిరపడ్డారు. విశాఖపట్నంలో జరిగిన సీపీఐ (ఎం) మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా 2015 లో ఎన్నికయిన ఆయన… వరుసగా 2018 , 2022 లలోనూ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన ఆయన… 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న ఆందోళనల కారణంగా ఆయన దిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో విద్యను కొనసాగించారు. సీబీఎస్ఈ పరీక్షలో ఏచూరి నేషనల్ లెవెల్లో ఫాస్ట్ ర్యాంక్ సాధించారు. సెయింట్ స్టీఫెన్ కాలేజ్ లో ఎకనామిక్స్ లో బి.ఏ. ఆనర్స్ పూర్తి చేసిన ఆయన జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ లో ఎకనామిక్స్ లో ఎం.ఏ. పట్టా అందుకున్నారు. అదే యునివేర్సిటి లో పీహెచ్ డీ లో చేరినప్పటికీ 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల వల్ల డాక్టరేట్ అందుకోలేకపోయారు.
1974 లో జే.ఎన్.యూ లో చదువుతున్నా సమయంలోనే స్తూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లో చేరారు. 1975 లో సి.పి.ఐ(ఎం) పార్టీ లో చేరిన ఆయన అనతి కాలంలోనే
ఎస్.ఎఫ్.ఐ. ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ కి 1984 లో ఎన్నికయిన ఆయన 1992 లో పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు. పార్టీలో తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుని కీలక కార్యకలాపాలు చేపట్టారు.
1977 లో ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఇందిరాగాంధీ జే.ఎన్.యు ఛాన్సలర్ గా కొనసాగడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆమె ఇంటి ముందు నిరసనకు దిగారు. ఆ సమయం లో పోలీసులు ఇందిరతో చర్చలకు అనుమతించడంతో సీతారాం ఏచూరి పట్టుబట్టి ఆమెను ఇంటి బయట ఉన్న విద్యార్థులను కలవాల్సిందే అని బయటికి తీసుకు వచ్చి, అందరి ముందు ఆమె రాజీనామా చేయాల్సిన కారణాలను మెమోరాండం చదివి వినిపించారు. ఆ తరువాత కొద్ది రోజులకు ఇందిరా ఆ పదవికి రాజీనామా చేసారు.
2005 లో రాజ్యసభలో అడుగుపెట్టిన సీతారాం ఏచూరి, 2011 లో రెండోసారి పెద్దల సభలో సభ్యుడిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ నుండి ఈయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. రవాణా, పర్యాటకం, సంస్కృతికి సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని రూపొందించడం లో 1966 లో ఆయన ముఖ్య పాత్ర వహించారు. 2004 లో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లో కీలకంగా వ్యవహరించారు.
క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే, వాటీజ్ దిస్ హిందూ రాష్ట్ర, ఆయిల్ పూల్ డెఫిసిట్ ఆర్ సెస్ పూల్ ఆఫ్ డెఫిసిట్, సూడో హిందూయిజం ఎక్స్‌పోజ్డ్ మొదలైన పుస్తక రచనలు చేశారు. ఏచూరి వివాహం ఇంద్రాణి మజుందార్ తో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు ఆశిష్, కూతురు అఖిల. ఇంద్రాణి తో విడాకుల తర్వాత ఆయన జర్నలిస్ట్ సీమ చిస్తీ ని వివాహం చేసుకున్నారు. అయితే ఏచూరి కుమారుడు ఆశిష్ 2021 ఏప్రిల్ లో కరొనతో మరణించారు. కూతురు సెయింట్ అండ్రస్ యూనివర్సిటీ లో లెక్చరర్ గా పనిచేస్తున్నారు.పార్లమెంట్ లోనూ, ప్రజా క్షేత్రం లోనూ అన్ని వర్గాల సమస్యల పట్ల పోరాటాలు, ప్రసంగాలు చేసి ప్రజానేత గా, కామ్రేడ్ గా నిలిచిపోయారు సీతారాం ఏచూరి.