Telugunewsfly: తాతయ్యకు మోకాళ్ళు నొప్పులు అందుకే కర్ర పట్టుకుని నడుస్తాడు. ఇది మన ముందు జెనరేషన్ చెప్పుకునే మాట. అంటే వయసు మీద పడిన వాళ్ళకే ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చేవి. కానీ తరం మారింది, తీసుకునే ఫుడ్ లో క్వాలిటీ తగ్గింది, శారీరక శ్రమ తగ్గింది.. ఫలితంగా మనకు ముప్ఫైల్లో, నలభైల్లోనే మోకాళ్ళ నొప్పులు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితి రాకుండా ముందుగానే ఎలా జాగ్రత్త పడాలి..
మోకాళ్ళ నొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
మోకాళ్ళ నొప్పికి ప్రధాన కారణం బరువు పెరగడం. మనం పెరిగే ప్రతి 5 కిలోల బరువు వల్ల మోకాళ్ళ పై 25 కిలోల బరువు పెరిగినంత ఒత్తిడి పడుతుంది. ఫలితంగా మోకాళ్ళు నొప్పికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే మన ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
ఈ రోజుల్లో ఎటువంటి కీళ్ల నొప్పికైనా ప్రధాన కారణం డి విటమిన్ తగ్గుదల. మోకాళ్ళ పై కూడా డి విటమిన్ లోపం అనేది చాలా ప్రభావం చూపుతుంది. ఈ లోపం అనేది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది కనుక ఒకసారి విటమిన్ డి టెస్ట్ చేయించుకుని తక్కువగా ఉన్నట్టయితే.. దానికి కావాల్సిన మందులు వాడటం మంచిది. దీని వల్ల మోకాళ్ళ నొప్పులు రాకుండా చూసుకోవచ్చు.
ఇక మన మోకాళ్ళ మధ్య ఉండే కార్టిలేజ్ అనేది అరగకుండా చూసుకోవడం కూడా నొప్పిని రాకుండా చేసుకునే ముందు జాగ్రత్తల్లో ఒకటి. ఈ అరుగుదలను ఆపడానికి ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. చేపలు, మాంసం, అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిలో ఇవి లభిస్తాయి. అందుకే ఇవి తరచు మన డైట్ లో భాగంగా చేసుకోవడం మంచిది. దీని వల్ల యాంటీ ఇన్ఫలమేటరీ గుణాన్ని పెంచుతుంది.
మన శరీరం యాక్టీవ్ గా ఉండాలన్నా.. ఎటువంటి శారీరక రుగ్మతలు, నొప్పులు రాకుండా ఉండాలన్నా.. ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. రోజులో ఒక అరగంట వ్యాయామానికి కేటాయించుకుంటే అది మనకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తొడ కండరాలు బలపడి మోకాళ్ళకు సపోర్ట్ గా పనిచేస్తుంది.
మోకాళ్ళకు చేటు చేసే ఆటలు, వ్యాయామాలు, స్మోకింగ్ లాంటి అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. షటిల్ ఆడడం, జాగింగ్ చేయడం తగ్గిస్తే మంచిది. తప్పనిసరి అయితే knee సపోర్టర్ వాడితే మంచిది.