Telugunewsfly: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ తొలి రోజు నుంచే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. రాష్ట్రం సాధించడమే కాదు.. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు అప్పటి ప్రభుత్వం చేసిన కృషి కూడా మామూలుదేం కాదు. ఆ ఫలితంగానే తాజాగా ప్రకటించిన ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ రెండవ స్థానంలో ఉంది.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేండ్లే అయినప్పటికీ దేశంలోని ధనిక రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండవ స్థానం దక్కించుకున్నది. ఈ విషయంలో ఎక్కువ క్రెడిట్ హైదరాబాద్ కే దక్కుతుంది. అనేక మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నప్పటికీ హైదరాబాద్ లో వ్యాపార వాణిజ్య రంగాలకు ఏనాడూ ఎలాంటి ఆటంకం కలగలేదు. సాఫ్ట్ వేర్, ఇతర కంపెనీలు, పరిశ్రమలు, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్ కి తరలివచ్చేలా ఇక్కడ గత ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఫలితంగా అమేజాన్, ఫ్లిప్ కార్ట్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చాయి. అభివృద్ధి అదే స్థాయిలో కొనసాగితే తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ ధనిక రాష్ట్రంగా మారేందుకు ఎక్కువ సమయమేం పట్టదు.