మనిషికి నిద్ర దేవుడిచ్చిన వరం. అలసిపోయిన శరీరానికి.. మనసుకు కాస్త ఊరటనిచ్చే శక్తివంతమైన ఔషధం. అన్నింటినీ మరిచిపోయి ఆదమరిచి నిద్రపోతే శరీరానికి, మనసుకు కొత్త శక్తి వస్తుంది. ఒకపూట తిండిలేకపోయినా ఉండొచ్చేమో గానీ.. సరిపడా నిద్రలేకపోతే మాత్రం మనిషి చాలా తొందరగా అలసిపోతాడు. మెదడు యాక్టివ్ గా పనిచేయాలన్నా.. నిర్ణయాలు తీసుకోవాలన్నా నిద్రలేకపోతే కష్టం.
అసలు ప్రస్తుత ఉరుకులు పరుగుల లైఫ్ స్టైల్ లో పొద్దున నిద్ర లేచింది మొదలు.. తోటివారితో పోటీ పడటమే జీవితమైపోయింది. అందరికంటే ముందుండాలి.. జీవితంలో ఎదగాలి అనే ఆలోచన మనిషిని నిద్రపోనివ్వడం లేదు. అయితే.. నిద్రలేమి మనిషి ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సరైన నిద్ర లేకపోతే మేధాశక్తి తగ్గుతుంది. ఏకాగ్రత కోల్పోతారు. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇలా చాలా సమస్యలు ఎదుర్కోక తప్పదు. అసలు ఏ వయసు వారు ఎంతసేపు నిద్రపోవాలో తెలుసుకుందామా మరి.
ఏ వయసు వారు ఎంతసేపు నిద్రపోవాలి?
– అప్పుడే పుట్టిన పిల్లలు.. రోజులో దాదాపు 18 గంటలు నిద్రపోవాలి.
– 3-5 ఏళ్ల పిల్లలు రోజుకు 13 గంటలు నిద్రపోవాలి.
– 6-12 ఏళ్ల వయసున్న పిల్లలు కనీసం 10 గంటలు నిద్రపోవాలి. చదువుకునే వయసు కాబట్టి మెదడుకు విశ్రాంతి అవసరం.
– 13 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలు రోజుకు 8గంటలు నిద్రపోతే చాలు.
– 18 నుంచి 60 ఏళ్ల వయసు వారు రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
– 60 ఏండ్లు దాటిన వారు ఆరోగ్యం మీద చాలా దృష్టి పెట్టాలి. కచ్చితంగా సరిపడా నిద్రపోవాలి. సమయానికి తినాలి. ఈ వయసులో ఒక్కసారి మెలకువ వస్తే మళ్లీ నిద్ర రాదు. అందుకే.. ప్రశాంతంగా నిద్ర పోయేందుకు ఏర్పాటు చేసుకోవాలి.
– కొన్నిసార్లు రాత్రి సమయంలో నిద్ర సరిపోకపోతే పగటి వేళల్లో కునుకు వస్తుంది. చాలామంది పగటి నిద్ర నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
– అలా చేయడం వల్ల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలో నెట్టేసిన వారవుతారు. పగటి సమయంలో నిద్ర వస్తుంటే శరీరం విశ్రాంతి కోరుతుందని అర్థం.
– ఒక ఐదు నిమిషాలు అలా పవర్ నాప్ తీస్తే.. కొంపలేం మునిగిపోవు. ఆఫీసులో అయినా పర్లేదు. ఓ ఐదు నిమిషాలు అలాగే కుర్చీలో రెస్ట్ రెప్ప వాల్చండి.
– ఆ తర్వాత ఓసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. చాలా ఉత్సాహంగా పనిచేస్తారు.
– చాలామంది రాత్రి వేళ్లలో టీ, కాఫీ, సిగరెట్ తాగుతుంటారు. పడుకునే ముందు సెల్ ఫోన్, టీవీ చూస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు.
– నిద్రకు ఉపక్రమించే రెండు గంటల ముందు టీ, కాఫీ తాగకండి. టీవీ, మొబైల్ పక్కకు పెట్టేయండి. ఏదైనా పుస్తకం చదవండి. కంటికి వ్యాయామం అవుతుంది. మెదడుకు మేత దొరుకుతుంది. మంచిగా నిద్ర పడుతుంది.