Telugunewsfly.com : తెలుగు రాష్ట్రాల్లో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు (మార్చి 3న) జరుగనుంది. అయితె.. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో పోలింగ్ జరిగినప్పుడు ఓట్ల లెక్కింపు చాలా జాగ్రత్తగా చేస్తారు. కాస్త సమయం కూడా ఎక్కువే పడుతుంది. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మాత్రం.. మిగతా ఓట్ల లెక్కింపు కంటే భిన్నంగా ఉంటుంది. తెలంగాణలో రెండు టీచర్స్.. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి, ఏపీలో రెండు గ్రాడ్యుయేట్లు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. అయితె.. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను ఎలా లెక్కిస్తారో ఈ స్టోరీలో చదివి తెలుసుకోండి.

సాధారణ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి గెలిచినట్టు ప్రకటిస్తారు. కానీ.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పద్ధతి వేరే ఉంటుంది. పోలైన ఓట్లలో 50 శాతానికి పైగా చెల్లుబాటు అయ్యే ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అయితే ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో కోటా ఎంతుండాలి అనేది ముందుగానే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు తీసేసి.. చెల్లుబాటు అయ్యే ఓట్ల లెక్క తేలుస్తారు. ఆ ఓట్లలో 50 శాతం లెక్కకట్టి.. ఎక్కువ శాతం ఎవరికి వస్తే వారిని విజేతగా నిర్ణయిస్తారు. ఉదాహారణకు.. 5వేల ఓట్లు పోలైతే.. 2501 ఓట్లు వచ్చిన అభ్యర్థి విజయం సాధించినట్టు లెక్క. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థి 2501 ఓట్ల కోటాను చేరుకోలేకపోతే.. ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా విజేతను నిర్ణయించే ప్రక్రియను ప్రారంభిస్తారు.
ఎలిమినేషన్ అంటే.. అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎన్ని వచ్చాయో లెక్కిస్తారు. ఆ ఓట్లను చివరి అభ్యర్థి కంటే ఎక్కువ వచ్చిన అభ్యర్థులకు పంచుతారు. అప్పుడు చివరి స్థానంలో నిలిచిన అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తారు. తొలిరౌండ్ ఎలిమినేషన్ తర్వాత ఎవరికి ఎక్కువ ఓట్లు ఎవరికి ఉంటే.. వారిని విజేతగా ప్రకటిస్తారు. అప్పటికీ.. ఎవరూ విజేతగా తేలకపోతే.. ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ.. చివరి వరకు ఎవరు నిలుస్తారో వారినే విజేతగా నిర్ణయించి.. ప్రకటిస్తారు. అయితే.. గ్రాడ్యుయేట్ల ఓట్లు లక్షల సంఖ్యలో ఉండటం వల్ల.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు చాలా సమయం పడుతుంది.