Telugunewsfly.com : ఒకవైపు పార్టీ లైన్ దాటి మాట్లాడిన వారిపై ఏఐసీసీ సీరియస్ గా చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు టీ- కాంగ్రెస్ నేతలు మాత్రం దూకుడు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు తగ్గించడం లేదు. నిన్ననే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ మీద చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం ఇంకా మరిచిపోకముందే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంత రావు ఇంట్లో మున్నూరు కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఏఐసీసీ సీరియస్ అయ్యింది.
ఇతర పార్టీలకు చెందిన నేతలు.. కుల సంఘాల నాయకులను పిలిపించి.. ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని ఏఐసీసీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాహసోపేతంగా బీసీ కులగణన చేస్తే అభినందించాల్సింది పోయి.. విమర్శ చేస్తారా ? కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి.. ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని.. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్ర పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు.