Telugunewsfly : సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుగా చెప్తున్న కేబీఆర్ పార్క్ ప్రాజెక్ట్ ఆపేయాలని తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్, అండర్ పాసు రోడ్ల నిర్మాణం వల్ల పర్యావరణ పరంగా సున్నితమైన కేబీఆర్ పార్క్ వాతావరణం దెబ్బ తింటుందని ఆయన ఆరోపించారు. రోడ్డు విస్తరణలో పలువురు ప్రముఖులు ఇండ్లు సైతం తొలగించాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను వెంటనే ఆపాలని ఆయన వ్యక్తిగత పిటిషన్ వేశారు. ఇప్పటికే కేబీఆర్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఇంటికి కూడా ముప్పు పొంచి ఉంది. ప్రాజెక్టును ఆపాలని ఇప్పటికే చంద్రశేఖర్ రెడ్డి ప్రజా వాణిలో ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో.. ఆయన హైకోర్టులో వ్యక్తిగత పిటిషన్ వేశారు. రోడ్ల విస్తరణలో తమ నివాసాలు పోకుంట ఆపాలని.. తమ నిర్మాణాలను సంరక్షించాలని కోరారు.