Telugunewsfly.com : తెలంగాణలో అమలవుతున్న ఉచిత బస్సు పథకాన్ని కొంతమంది మిస్ యూజ్ చేస్తున్నారు. తాజాగా జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఫ్రీ బస్సు పథకాన్ని అలుసుగా తీసుకొని కొంతమంది ఆర్టీసీ కండక్టర్లు నయా దందాకు తెరలేపారు. ECIL నుండి అఫ్జల్‌గంజ్ వెళ్తున్న (TS02Z0267) నెంబర్ గల బస్సులో ఎక్కిన యువకుడు కండక్టర్‌ను టికెట్ ఇవ్వాలని అడిగాడు. అయితే సదరు కండక్టర్… మహిళలకు ఇచ్చే మహాలక్ష్మి (మహిళలకు ఫ్రీ బస్సు) టికెట్ ఇచ్చి రూ.30 వసూల్ చేశాడు.
ఫ్రీ టికెట్ కొట్టి డబ్బులు తీసుకుంటావేంటి? అయినా మహిళలకు ఇచ్చే ఉచిత బస్సు పథకం టికెట్ నాకెందుకు ఇచ్చావు? చెకింగ్ ఆఫీసర్లు వస్తే నా పరిస్థితి ఏంటి? అని అడిగితే… ఆ కండక్టర్ ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించి.. టికెట్ ఇచ్చే మెషిన్ సరిగ్గా పనిచేయట్లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. కాగా కండక్టర్ తీరుపై బస్సులోని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.