Telugunewsfly : మహిళా అఘోరి మరోసారి కత్తులతో హల్‌చల్ చేస్తూ.. రైతులను, స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. నెల్లూరు హైవేలోని ఓజిలి మండలం, చుట్టుగుంట సమీపంలో మదనపల్లి నుంచి పిఠాపురం తరలిస్తున్న ఎద్దుల లారీని అడ్డుకొని రచ్చ చేసింది. కత్తులు, శూలాలతో రైతులను భయబ్రాంతులకు గురి చేసింది. వ్యవసాయం చేసేందుకు ఎద్దులు కొనుక్కోని తీసుకెళ్తున్నామని చెప్పినా వినకుండా.. ఎద్దులను కబేళాకు తరలిస్తున్నారంటూ దాడి చేయబోయింది. పిఠాపురం వెళ్లేలోపు ఎద్దులను తరలిస్తున్న లారీని తగలబెడతానంటూ హెచ్చరించింది.

గత నెల ఫిబ్రవరి 3న వేములవాడ రాజన్న దేవాలయం పరిధిలోని దర్గాను కూల్చేస్తానంటూ బయల్దేరిన అఘోరీని సిరిసిల్ల జిల్లా జిల్లెల చెక్ పోస్టు దగ్గర ఆపేశారు. రోడ్డుపై అఘోరి రచ్చ రచ్చ చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు టోయింగ్ వెహికిల్‌తో అఘోరీ కారును అక్కడి నుంచి తరలించారు.

నెలరోజుల క్రితం వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చి.. అక్కడ భక్తులను ఇబ్బందులకు గురి చేసింది. దీంతో ఓ వృద్ధుడు అఘోరితో వాదనకు దిగాడు. దీంతో కత్తితో అఘోరీ వృద్ధుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో.. స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. అఘోరీవి అయి ఉండి మహా కుంభమేళాకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించగా అసహనంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా.. రోజురోజుకు అఘోరీ ఆగడాలు పెరిగిపోతున్నాయని.. ఆమెను కంట్రోల్ చేయాలంటూ ప్రజలు అధికారులను కోరుతున్నారు.