TeluguFlyNews : వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామిపై నాంపల్లి కోర్టు సంచలన తీర్పు చెప్పింది. జాతకాల పేరు చెప్పి ప్రజలను వేణుస్వామి తప్పుడుదోవ పట్టిస్తున్నాడని మూర్తి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. ప్రముఖులకు జాతకం చెప్పానని.. వారంతా తన వద్దకు వస్తారని వేణుస్వామి చెప్పేవన్నీ అబద్ధాలని ఆయన ఆరోపించారు.
సినీ సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు తన వద్దకు వస్తారంటూ చూపించే ఫొటోలన్నీ మార్ఫింగ్ అని మూర్తి పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను కూడా వేణుస్వామి మార్ఫింగ్ చేశాడని ఆరోపించారాయన. మూర్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని తీర్పునిచ్చింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. గతంలో సైతం వేణుస్వామి సమంతా, నాగచైతన్యల విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మొన్న మరోసారి నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల విషయమై మరోసారి వ్యాఖ్యలు చేసి.. మా నుంచి నోటీసులు అందుకున్నారు. తాజాగా నాంపల్లి కోర్టు తీర్పుతో వేణుస్వామిపై చర్యలు తప్పవంటున్నారు పలువురు.