వక్రతుండ మహకాయ
సూర్యకోటి సమప్రభ !
నిర్విఘ్నం కురుమీదేవ
సర్వ కార్యేషు సర్వదా!!
అని వేడుకుంటూ ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో, తమ వీదిలో వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుని ప్రతిష్టించుకుని ఉత్సవాలు జరుపుకునే దైవం వినాయకుడు. ఆ విగ్రహాన్ని నిలబెట్టడం, మైక్ సెట్లలో ఉదయం, సాయంత్రం మంత్రొచ్చారణలు, పాటలతో మారుమోగించడం అన్ని ప్రాంతాల్లో ఉత్సాహంతో ఈ ఉత్సవాల్లో పాల్గొనడం పరిపాటి. అయితే ఈ ఉత్సవాలను జరిపే ప్రాంతాల్లో ప్రముఖమైనది, ప్రదానమైనది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ.
ఈ సంవత్సరం 70 అడుగుల ఎత్తుతో 70 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఆ ఖైరతాబాద్ వినాయకుని ఉత్సవాలను మొదలెట్టింది ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత కలగడం సహజం. మరి ఇంతగా అందరూ ఆరాధించే ఆ వినాయకుడిని అక్కడ మొదటగా నిలబెట్టింది ఎవరు…
1954 వ సంవత్సరంలో మొదటిసారిగా ఎస్. శంకరయ్య అనే స్వతంత్ర సమరయోధుడు ఇక్కడ విఘ్నేశ్వరుని విగ్రహాన్ని పెట్టి… ఉత్సవాలను మొదలుపెట్టారు. గణేష్ ఉత్సవ కమిటీ ని ఏర్పాటు చేసారు. అలా మొదలైన సంబరాలు ప్రతి సంవత్సరం కొనసాగుతూ 70 ఏళ్లు పూర్తి చేసుకుని 70 అడుగులకు చేరుకుని మహాగణపతి గా నిలబడ్డాడు. రాజకీయ నాయకులు, మంత్రులు సైతం ఇక్కడికి రావడం, పూజలు నిర్వహించడం ఒక సెంటిమెంట్ గా భావిస్తారు. ప్రజలు తండోపతండాలుగా ఆ మహా గణపతిని దర్శించుకుని తరిస్తారు.