Telugunewsfly.com: గోల్డ్ కొనే వారిలో వందకు 90 శాతం మంది బంగారాన్ని, బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు అనే ఆలోచన కలవారే. ఇలా gold loan మీద ఆధారపడి బిజినెస్ లు పెట్టినవారు కూడా ఉన్నారు. అంతే కాదు, ముందుగా గోల్డ్ లోన్ తీసుకుని పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీజులు కట్టి, మెల్లిగా వాయిదాల వారీగా అప్పు తీర్చుకునేవారూ.. ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా బ్యాంకులు తమ నిబంధనలు మార్చేసరికి, ఇలాంటి వారికి ఇబ్బందులు తప్పేలా లేవు.

గతంలో గోల్డ్ లోన్ తీసుకుని.. సంవత్సరం తర్వాత, ఆ ఏడాదికి ఎంత వడ్డీ అవుతుందో, అంత చెల్లించి లోన్ రెన్యువల్ చేసుకునేవారు. లోన్ తీసుకున్నవారి వెసులుబాటును బట్టి, తాము తీసుకున్న అసలు మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించి, తమ లోన్ అకౌంట్ ను క్లోజ్ చేసేవారు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త నిబంధన ప్రకారం, లోన్ తీసుకున్న నాటి నుండి సంవత్సరం గడిచిన రోజున.. వినియోగదారుడు తీసుకున్న అసలు మరియు వడ్డీ మొత్తాన్ని చెల్లించి, లోన్ అకౌంట్ క్లోజ్ చేయవలసి ఉంటుంది. లేకపోతే డిఫాల్టర్ అవుతారు.

ఇలాంటి నిబంధనలు పెట్టడం ఏంటి, అంత డబ్బు తిరిగి ఒకే సంవత్సరంలో కట్టగలిగితే లోన్ ఎందుకు తీసుకుంటాం అని కస్టమర్స్ వాపోతున్నారు. ఇవే కాకుండా.. ఇప్పుడు RBI మరిన్ని కొత్త నిబంధనలను తీసుకువస్తుంది. బంగారం తనఖా పెట్టేవారు, ఆ బంగారం తమదే అని నిరూపించుకోవాలి. అగ్రికల్చర్ గోల్డ్ లోన్ తీసుకుంటే, భూమి ఉన్నట్టుగా పాస్ బుక్స్ చూపించాలి. ఇలా గతంలో gold loan ఖాతాల్లో జరిగిన మోసాలను అరికట్టడానికి RBI వారు అన్ని బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ లు ఒకే రకమైన నిబంధనలు పాటించవలసినదిగా ఉత్తర్వులు జారీ చేసింది.