Telugunewsfly.com: పిల్లలు పుట్టకముందే వారి పుట్టు వెంట్రుకలు ఎక్కడ ఇవ్వాలో మొక్కుకుంటాం, ఏదైనా పని అవ్వాలంటే.. తలనీలాలు ఇస్తాం అని దేవుడిని వేడుకుంటాం. ఇలా భక్తులు రకరకాల కారణాలతో తమ తల నీలాలు భగవంతుడికి సమర్పించుకుంటారు. మరి దేవస్తానాల్లో ఈ కార్యక్రమం జరిపే స్థలాన్ని మాత్రం క్షవర శాల లేదా గుండు చేయు స్థలం అనకుండా కళ్యాణ కట్ట అని రాస్తారు. ఇలా రాయడానికి ఒక బలమైన కారణం ఉంది.

తల నీలాలు ఇస్తే పాపాలు తొలగుతాయని అంటారు. అందుకే పుట్టిన పిల్లలకు, పూర్వ జన్మలో పాపాలు తల వెంట్రుకల ద్వారా సంక్రమిస్తాయి అని, వాటి నుండి విముక్తి కలిగించడానికి, భగవంతుని క్షేత్రంలో వెంట్రుకలు తీయించి గుండు చేస్తారు. ఇలా పాపాలు తొలగించి, జీవితాన్ని కళ్యాణప్రదంగా మార్చే ప్రక్రియ కాబట్టి దీనిని క్షవరం అనకుండా.. కళ్యాణం అని పిలవాలని, నాటి రాజైన జనమేజయుడు యొక్క సోదరుడు శతానికుడు ఆజ్ఞాపించాడు. ఆనాటి నుండి ఈ కార్యక్రమం జరిగే స్థలాన్ని కళ్యాణ కట్ట అని పిలవడం ఆనవాయితీ.